“తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును”. (2 దిన. 16:9)
దేవుడు లోకంలో దేని కోసం వెతుకుతున్నాడు? సహాయకుల కోసమా? కాదు. సువార్త అనేది “సహాయాన్ని కోరే” సంకేతం కాదు. అలాగని, క్రైస్తవ పరిచర్య చేసేందుకు పిలుపునిచ్చేది కూడా కాదు.
దేవుడు తన కోసం పనిచేసే వ్యక్తుల కోసం వెతకడం లేదు. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ” (2 దినవృత్తా౦తములు 16:9). ఆయన గొప్పగా పని చేస్తాడు. ఆయన భారాన్ని మోసే విశాలమైన భుజాలను కలిగి ఉన్నాడు. ఆయనే బలవంతుడు. ఆయన తన బలాన్ని చూపించడానికి మార్గాల కోసం వెతుకుతున్నాడు. ఈ విషయమే లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారి నుండి ఆయనను వేరు చేసి చూపుతుంది: ఆయన మన కోసం పని చేస్తాడు. యెషయా 64:4, “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు [మరొక విధంగా చెప్పాలంటే, ఇదే ఆయన ప్రత్యేకత] అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు.”
దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? మనం ఆశించేది ఆయన కోరుకోవడంలేదు. ఆయన వద్దకు అనేకమైన బలులను తీసుకు వచ్చినందుకు ఆయన ఇశ్రాయేలును గద్దిస్తున్నాడు: “నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను. అడవి మృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావే గదా కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను” (కీర్తన 50:9-10, 12).
అయితే, లబ్దిని పొందుకునే వ్యక్తి స్థాయికి దేవుణ్ణి దిగజార్చకుండ మనం ఆయనకు ఏమీ ఇవ్వలేమా?
తప్పకుండ మనమివ్వగలం. మన ఆందోళనలు. మన అవసరాలు. ఆయన చిత్తాన్ని చేయడానికి కావాల్సిన శక్తి కోసం మనం చేసే ఆక్రందనలను మనం ఆయనకు ఇవ్వగలం.
“మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” (1 పేతురు 5:7) అనేది ఒక ఆజ్ఞ. మనం ఆధారపడే స్థితిని మరియు ఆయనే మనకు సర్వమైయున్నాడనే స్థితిని తెలియజేసే దేనినైనా దేవుడు మన ను౦డి స౦తోష౦గా స్వీకరిస్తాడు.
క్రైస్తవ్యం అనేది ప్రాథమికంగా పునరుద్ధరణకు సంబంధించినది. రోగులు తమ వైద్యులకు సేవ చేయరు. మంచి చికిత్స కోసం మరియు మంచి ఔషధాల కోసం వారు వైద్యులను నమ్ముతారు. కొండ మీద ప్రసంగం అనేది మన డాక్టర్ యొక్క చికిత్సా నియమమే గాని యజమాని యొక్క ఉద్యోగ వివరణ కాదు.
దేవుని కోసం పని చేయకుండానే మన జీవితాలు నిలిచిపోతున్నాయి. “పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది” (రోమా 4:4-5).
పని చేయువారికి ఎటువంటి బహుమతులు ఉండవు. వారు పొందుకోవాల్సిన దానిని పొందుకుంటారు, అంటే వారు తమ పనికి తగిన జీతాన్ని పొందుకుంటారు. నీతిమంతులుగా తీర్చబడే బహుమానాన్ని మనం పొందుకున్నట్లయితే, దాని కోసం మనం పని చేయడానికి సాహసించం. దీనికి సంబంధించిన విషయంలో దేవుడే పని చేయువాడుగా ఉన్నాడు. ఆయన కృపను ప్రసాదించిన పోషకుడుగా మహిమను పొందుకుంటాడు గాని సేవలందుకునే లబ్దిదారుడుగా ఉండడు.