“చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు”. (1 యోహాను 3:7-8; 2:1-2)

ఈ అద్భుతమైన పరిస్థితిని నాతో పాటు ఆలోచించండి. దేవుని కుమారుడు మీరు పాపం చేయకుండా ఆపడానికి అంటే సాతాను యొక్క పనులను నాశనం చేయడానికి వచ్చినట్లయితే, అలాగే  మీరు పాపం చేసినప్పుడు, ప్రాయశ్చిత్తం అంటే దేవుని ఉగ్రతను తీసివేయడానికి వచ్చినట్లయితే, అలాంటప్పుడు మన అనుదిన జీవితంలో ఈ సత్యాల ప్రభావం ఏంటి?

మూడు విషయాలు. మరియు వాటిని కలిగి ఉండడం అద్భుతం. వాటిని క్రిస్మస్ కానుకలుగా క్లుప్తంగా మీకు ఇస్తున్నాను.

బహుమతి #1. జీవించడానికి ఒక స్పష్టమైన ఉద్ధేశ్యం

జీవించడానికి మీకు స్పష్టమైన ఉద్దేశ్యం ఉందని ఇది సూచిస్తుంది. దీనికి వ్యతిరేకమైన అర్ధం ఇదే: పాపం చేయవద్దు – దేవున్ని అగౌరవపరిచేలా ఏమి చేయవద్దు. “మీరు పాపము చేయకుండునట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను” (1 యోహాను 2:1). “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను ” (1 యోహాను 3:8).

“మీరు మాకు ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా ఇవ్వగలరా?” అని మీరు అడిగితే దానికి సమాధానం: అవును, ఇదంతా 1 యోహాను 3:22 లో సంగ్రహించబడింది. ఇది యోహాను పత్రికకు అవసరమైన గొప్ప సారాంశం. “ఆజ్ఞ” అనే ఏకవచనాన్ని గమనించండి – “ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే.” ఈ రెండు విషయాలు యోహానుకు చాలా దగ్గరి సంబంధం కలిగిన అంశాలుగా ఉన్నాయి, అతను వాటిని ఒక ఆజ్ఞ అని పిలుస్తున్నాడు: యేసును నమ్మండి మరియు ఇతరులను ప్రేమించండి. అదే ఉద్దేశ్యం. అదే క్రైస్తవ జీవితానికి సంబంధించిన మొత్తాన్ని ఒక మాటలో చెప్పడం. యేసును విశ్వసించడం, యేసు మరియు ఆయన అపొస్తలులు మనకు ప్రేమించడం నేర్పిన విధంగా ప్రజలను ప్రేమించడం. యేసును నమ్మండి, ప్రజలను ప్రేమించండి. ఇదే మొదటి బహుమతి: జీవించడానికి ఒక ఉద్ధేశ్యం.

బహుమతి #2. మన వైఫల్యాలు క్షమించబడతాయని ఆశిస్తున్నాను

మన పాపాన్ని నాశనం చేయడానికి మరియు మన పాపాలను క్షమించడానికి క్రీస్తు వచ్చాడు అనే రెండు సత్యాలు సూచించే రెండవ సూచన: మన వైఫల్యాలు క్షమించబడతాయని మనకు నమ్మకం ఉన్నప్పుడు మన పాపాన్ని అధిగమించడంలో పురోగతి సాధిస్తాము. దేవుడు మీ వైఫల్యాలను క్షమిస్తాడనే ఆశ మీకు లేకుంటే, మీరు పాపంతో పోరాడటం ప్రారంభించినప్పుడు, మీరు సులువుగా వదులుకుంటారు.

మీలో చాలా మంది కొత్త సంవత్సరంలో కొన్ని మార్పుల గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు పాపపు అలవాట్లలో పడిపోయారు మరియు బయటపడాలని కోరుకుంటున్నారు. మీరు కొత్త ఆహారపు అలవాట్లను, వినోదంకి సంబంధించిన కొత్త అలవాట్లను,  ఇవ్వడానికి సంబంధించిన కొత్త అలవాట్లను, మీ జీవిత భాగస్వామితో సంబంధాలను మెరుగుపరచటంకు కొత్త అలవాట్లను, కొత్త కుటుంబ ప్రార్ధనా అలవాట్లను, నిద్ర మరియు వ్యాయామం సంబంధించిన కొత్త అలవాట్లను, సాక్ష్యం చెప్పటంలో ఉండవలసిన  ధైర్యం విషయంలో కొత్త అలవాట్లను కోరుకుంటున్నారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు, దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచిస్తున్నారు. ఇదిగో మీ రెండవ క్రిస్మస్ కానుక: క్రీస్తు అపవాది క్రియలను నాశనం చేయడమే కాదు – మన పాపం – మన పోరాటంలో విఫలమైన అనుభవాల కారణంగా అతను మనకు ఉత్తరవాదిగా కూడా వచ్చాడు.

కాబట్టి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఓటమి అంతిమం కాదు అనే వాస్తవం మీకు పోరాడాలనే ఆశను ఇవ్వనివ్వండి. అయితే జాగ్రత్త! మీరు దేవుని కృపను దుర్వినియోగం చేసి, “సరే, నేను ఓడిపోతే, అది పెద్ద విషయం కాదు కాబట్టి పాపంతో పోరాడటం ఎందుకు?” అని అనుకుంటే ప్రమాదం.” మీరు అలా అర్థం చేసుకుంటే, దాని ప్రకారం నడుచుకొన్నట్లైతే, మీరు బహుశా క్రొత్తగా జన్మించలేదు మరియు మీరు భయపడాల్సిన అవసరం ఉంది. 

కానీ మీలో చాలా మంది అలాంటివారు కాదు. మీలో చాలామంది పాపభరితమైన విధానాలతో పోరాడాలని కోరుకుంటారు. మరియు దేవుడు మీతో చెప్పేది ఏమిటంటే: మీ వైఫల్యాలను క్రీస్తు కప్పి ఉంచడం మీ  పోరాటానికి నిరీక్షణను ఇస్తుంది. “మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.”

బహుమతి #3. క్రీస్తు మనకు సహాయం చేస్తాడు

చివరిగా, మన పాపాన్ని నాశనం చేయడానికి మరియు మన పాపాలను క్షమించడానికి క్రీస్తు వచ్చాడు అనే ద్వంద్వ సత్యం యొక్క మూడవ సూచన: మన పోరాటంలో క్రీస్తు నిజంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన నిజంగా మీకు సహాయం చేస్తాడు. ఆయన మీ పక్షాన ఉన్నాడు. పాపం సరదాగా ఉంటుంది కాబట్టి ఆయన పాపాన్ని నాశనం చేయడానికి రాలేదు. పాపం ప్రాణాంతకం కాబట్టి పాపాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఇది సాతాను యొక్క మోసపూరిత పని, మరియు మనం దానితో పోరాడకపోతే అది మనల్ని నాశనం చేస్తుంది. ఆయన బాధపెట్టడానికి కాదు గాని మనకి సహాయం చేయడానికి వచ్చాడు.కాబట్టి మీ మూడవ క్రిస్మస్ కానుక ఇక్కడ ఉంది: మీలో ఉన్న పాపాన్ని అధిగమించడానికి క్రీస్తు సహాయం చేస్తాడు. 1 యోహాను 4:4 ఇలా చెబుతోంది, “మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు.” యేసు సజీవుడు, సర్వశక్తిమంతుడు, విశ్వాసం ద్వారా యేసు మనలో నివసిస్తున్నాడు. మరియు యేసు మన కొరకు ఉన్నాడు, మనకు వ్యతిరేకం కాదు. కొత్త సంవత్సరంలో పాపంతో చేసే మీ పోరాటంలో ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయనను నమ్మండి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *