“నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము”. (ఫిలిప్పీ 1:21)

చావు అనేది “లాభమెలా” అవుతుంది?

  1. మన ఆత్మలు సంపూర్ణ సిద్ధిని పొందుకుంటాయి (హెబ్రీ 12:22-23).

ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

మనలో పాపం ఏ మాత్రం ఉండదు. మనల్ని ప్రేమించి, మనకోసం తనను తాను అర్పించిన ప్రభువును బాధపెట్టడం వల్ల కలిగే అంతర్గత యుద్ధం, హృదయ విదారక నిరుత్సాహాలు మనకుండవు. 

  1. మనం ఈ లోక సంబంధమైన బాధ నుండి విశ్రాంతి పొందుకుంటాం (లూకా 16:24-25)

పునరుత్థాన ఆనందాన్ని మనము అప్పటికి పొందుకోలేము గానీ బాధ నుండి స్వాతంత్యం కలిగించు ఆనందం మనదవుతుంది. మరణంలో జరగబోయేటువంటి సంఘటనను చూపించడానికి లాజరు మరియు ధనవంతుని గురించిన కథను యేసు చెప్తున్నాడు.  

అప్పుడతడు [ధనవంతుడు] పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి ‘తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను – నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను.’ అందుకు అబ్రాహాము – ‘కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.’” 

  1. మన ఆత్మలలో గాఢమైన విశ్రాంతిని పొందుకుంటాం (ప్రకటన 6:9-11)

ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు – నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు – వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

అత్యంత ప్రశాంతమైన సరస్సు వద్ద అత్యంత సంతోషకరమైన క్షణాల్లో అత్యంత మృదువైన వేసవి సాయంత్ర సమయంలో మనం అనుభవించినవాటికి మించిన ప్రశాంతత, ఎల్లప్పుడూ దేవుని నిరంతర సంరక్షణలోనే ఉంటుంది. 

  1. మనం లోతైన ఇంటి వాతావరణాన్ని అనుభవిస్తాం (2 కొరింథీ 5:8)

ఇట్లు ధైర్యముగలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.

మానవ జాతి అంతా తమకు తెలియకుండానే దేవుని కోసం ఆరాటపడుతోంది. మనం క్రీస్తు ఇంటికి వెళ్ళినప్పుడు, మనకు తెలిసిన భద్రత మరియు శాంతి భావనకు మించిన తృప్తిని అక్కడ మనం పొందుకుంటాం. 

  1. మనం క్రీస్తుతోపాటు ఉంటాం (ఫిలిప్పీ 1:21-23)

భూమి మీదనున్న వారందరికంటే  క్రీస్తు అత్యంత అద్భుతమైన వ్యక్తి. మీరు ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడే వ్యక్తులకంటే ఆయన జ్ఞానవంతుడు, బలవంతుడు మరియు దయగలిగినవాడై ఉన్నాడు. ఆయన హద్దులులేని ఆసక్తిని కలిగియుంటాడు. ఆయనకిష్టమైన వారిని వీలైనంత మట్టుకు సంతోషంగా ఉంచడానికి ప్రతి క్షణం ఏమి చెప్పాలో, ఏమి చేయాలో ఆయనకి చాలా బాగా తెలుసు. ప్రేమలో ఆయన విస్తరిస్తాడు మరియు ఆయనకు ప్రియమైనవారు ప్రేమించబడ్డారని భావించేలా చేయడానికి ఆ ప్రేమను ఎలా ఉపయోగించాలో అనే విషయంలో అనంతమైన ఆలోచనను కలిగియున్నాడు. 

అందుకేనేమో, నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు అని పౌలు అన్నాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *