“మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు”. (ఎఫెసీ 5:31–32)
ఇక్కడ ఎఫెసీ 5:31లో మోషే మాట్లాడిన ఆదికాండము 2:24ని పౌలు ఉటంకిస్తున్నాడు – మరియు దేవుడు మోషే ద్వారా చెప్పాడని యేసు చెప్పాడు (మత్తయి 19:5) – “పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.” ఆదాము పాపంలో పడకముందు మాట్లాడిన ఈ దేవుని వాక్యం క్రీస్తుకు మరియు సంఘమునకు సూచనగా ఉంది మరియు అందువల్ల గొప్ప రహస్యం అని పౌలు అంటున్నాడు.
దీనర్థం ఏమిటంటే, దేవుడు స్త్రీ పురుషులను సృష్టించి, వివాహబంధాన్ని నిర్ణయించినప్పుడు, వారు ఒకరికొకరు ఎలా సంబంధం కలిగి ఉంటారనే దాని గురించి ఆయన పాచికలు వేయలేదు లేదా గడ్డిని గీయలేదు లేదా నాణెం తిప్పలేదు. తన కుమారుడు మరియు సంఘం మధ్య సంబంధమును అనుసరించి ఆయన ఉద్దేశపూర్వకంగా వివాహాన్ని రూపొందించాడు. ఈ సంకల్పాన్ని నిత్యత్వం నుండి ఆయన కలిగియున్నాడు.
అందువల్ల, వివాహం ఒక రహస్యం – బయటికి కనిపించే దానికంటే చాలా గొప్ప మర్మంగా ఉన్న అర్థాన్ని ఇది కలిగి ఉంది. దేవుడు మానవులను పురుషుడుగాను మరియు స్త్రీనిగాను సృష్టించాడు మరియు వివాహాన్ని నియమించాడు, తద్వారా క్రీస్తుకు మరియు ఆయన సంఘమునకు మధ్య శాశ్వతమైన నిబంధన సంబంధాన్ని వివాహ ఏకత్వంలో ఉంచాడు.
ఈ రహస్యం నుండి పౌలు అన్వయించుకొన్నది ఏమిటంటే, వివాహంలో భార్యాభర్తల పాత్రలు ఎలాబడితే అలా నిర్ణయించబడవు, కానీ క్రీస్తు మరియు ఆయన సంఘం యొక్క విలక్షణమైన పాత్రలు వివాహాములోని పాత్రలకు మూలము.
మనలో పెళ్లయిన వారు, మనకంటే ఎంతో పెద్దది మరియు గొప్పది అయిన బ్రహ్మాండమైన దైవిక వాస్తవాలను చూపించే ఆధిక్యతను వివాహం ద్వారా దేవుడు మనకు ప్రసాదించడం ఎంత నిగూఢమైనదో మరియు అద్భుతమైనదో మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
క్రీస్తు మరియు సంఘములను గూర్చిన ఈ మర్మం వివాహం విషయంలో ఉండవలసిన ప్రేమ యొక్క నమూనాకు పునాది. ప్రతి జీవిత భాగస్వామి మరొకరి ఆనందంలో తన స్వంత ఆనందాన్ని వెంబడించాలని చెప్పడం సరిపోదు. అది నిజం. కానీ అది చాలదు. క్రీస్తు మరియు సంఘం కోసం దేవుడు ఉద్దేశించిన సంబంధాన్ని భార్యాభర్తలు స్పృహతో అనుసరించాలని చెప్పడం కూడా ముఖ్యం. అంటే, ప్రతి ఒక్కరూ క్రీస్తు మరియు సంఘం కోసం దేవుడు నిర్మించిన స్వచ్ఛమైన సంతోషకరమైన విలక్షణమైన ఉద్ధేశ్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి.
మీరు ఒంటరివారైనా, పెళ్లయినా, ముసలివారైనా, చిన్నవారైనా దీన్ని తీవ్రంగా పరిగణించాలని ఆశిస్తున్నాను. నిబంధనను నెరవేర్చే క్రీస్తు ప్రత్యక్షతపై – ఆయన నిబంధనను నెరవేర్చే సంఘం ఆధారపడుతుంది.