“మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను”. (హెబ్రీ 11:24-26)

లేదా, ఈ వాక్యాన్ని అత్యంత ప్రాధాన్యత అంశాలకు కుదించి వ్రాసినప్పుడు, “విశ్వాసం ద్వారా మోషే…. పాప సంబంధమైన క్షణిక సుఖాలను [విడిచిపెట్టాడు]… ఎందుకంటే ప్రతిఫలంగా కలుగబోవు బహుమానం మీద దృష్టిపెట్టాడు” (హెబ్రీ 11:24-26)

విశ్వాసం అనేది “క్షణిక సుఖాలతో” తృప్తి చెందేది కాదు.  ఇది చిరకాలం ఉండే, శాశ్వతంగా నిలిచిపోయే ఆనందం కోసం ఆకలి కలిగి ఉంటుంది. “జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు” (కీర్తన 16:11) అని దేవుని వాక్యం చెబుతోంది. అందుచేత, పాపసంబంధమైన మోసపూరితమైన ఆనందాల ద్వారా విశ్వాసము దారి తప్పదు. అది ఎల్లప్పుడు అత్యున్నతమైన ఆనందాన్ని కోరుకుంటుంది.

దేవుని వాక్యము యొక్క పాత్ర ఏంటంటే దేవుని కోసం ఉండే విశ్వాస సంబంధమైన ఆకలిని తీర్చడం. ఇలా ఆకలిని తీర్చడంలో మోహానికి సంబంధించిన మోసపూరితమైన రుచి నుండి నా హృదయాన్ని తప్పిస్తుంది.

మొట్టమొదటిగా, నేను పరిశుద్ధ మార్గాన్ని అనుసరిస్తే నేను నిజంగా ఏదో ఒక గొప్ప తృప్తిని వదులుకుంటాననే భావనను కలిగించేందుకు మోహం నన్ను మోసగించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే, నేను ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకొని, పోరాటం చేయడానికి ప్రారంభిస్తాను.

  • మోహించుటకంటే నా కన్ను తీసివేయబడటమే మంచిదని నేను చదివాను (మత్తయి 5:29)
  • నేను పవిత్రమైన, రమ్యమైన మరియు ఖ్యాతిగల విషయాల గురించి ఆలోచిస్తే, దేవుని సమాధానం నాతో ఉంటుందని (ఫిలిప్పీ 4:8-9) నేను చదివాను.
  • శరీర సంబంధమైన విషయాల మీద మనస్సు పెడితే మరణం వస్తుందని, ఆత్మ సంబంధమైనవాటి మీద మనస్సు పెడితే జీవము, సమాధానం కలుగుతుందని (రోమా 8:6) నేను చదివాను.
  • మోహం నా ఆత్మతో యుద్ధం చేస్తుందని (1 పేతురు 2:11) మరియు ఈ జీవితానికి సంబంధించిన సుఖాలు ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని (లూకా 8:14) నేను చదివాను.
  • కానీ అన్నిటికంటే ఉత్తమమైనదిగా, భక్తిహీనుల నుండి దేవుడు ఏ మంచి విషయాన్ని కనుగొనలేడని (కీర్తన 84:11), హృదయ శుద్ధిగలవాడు దేవుణ్ణి చూస్తాడని (మత్తయి 5:8) నేను చదివాను.

నా విశ్వాసం దేవుని జీవంతోను మరియు సమాధానంతోను తృప్తి చెందాలని నేను ప్రార్థిస్తున్నప్పుడు, ఆత్మ ఖడ్గం మోహపు విషాన్ని వెదజల్లే తీపి పొరలను తొలగిస్తుంది. అది దేని కోసమో నేను దాన్ని చూస్తాను. దేవుని కృప ద్వారా దానికున్న ఆకర్షణీయమైన శక్తి విచ్ఛిన్నమవుతుంది.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *