“మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావము గలవారునై యుండిన మిమ్మును కూడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను”. (కొలస్సి 1:21–22)
ప్రపంచంలోని అత్యుత్తమ వార్త ఏమిటంటే, దేవునికి దూరస్తులుగా ఉండడం ముగిసింది; విశ్వ న్యాయమూర్తితో మనం సమాధాన పడ్డాము. దేవుడు ఇకపై మనకు వ్యతిరేకం కాదు, మన కోసమే ఉన్నాడు. మనపై సర్వశక్తిమంతుని ప్రేమ ఉండటం మన ఆత్మకు బలము. విశ్వంలోని బలమైన వాడు మీ కోసం ఉన్నప్పుడు జీవితం పూర్తి స్వేచ్ఛగా మరియు ధైర్యంగా మారుతుంది.
అయితే కొలస్సి. 1:21లోని నిర్ధారణను తిరస్కరించే వారికి పౌలు రక్షణ సందేశం శుభవార్త కాదు. అతను ఇలా అంటాడు, మీరు “దేవునికి దూరస్థులును, … మీ మనస్సులో విరోధభావము గలవారు.”
“నా జీవితంలో దేవుని కృప లేకపోతే, నేను దేవునికి శత్రువుని” అనే చెప్పేవారు ఎంత మంది మీకు తెలుసు? “నేను దేవుణ్ణి ద్వేషిస్తున్నాను” అని చాలా అరుదుగా చెప్తారు. కాబట్టి, ప్రజలు క్రీస్తు రక్తం ద్వారా సమాధానపడక ముందు దేవునిపట్ల “మనస్సులో విరోధభావము” కలిగి ఉన్నారు అని పౌలు చెప్పడంలో అర్థం ఏమిటి?
ప్రజలకు దేవునికి మధ్య నిజంగా శత్రుత్వం ఉందని పౌలు అంటున్నాడని నేను అనుకుంటున్నాను. కాని ప్రజలు తమకై తాము నిజమైన దేవుని గురించి ఆలోచించరు. వారికి నచ్చినట్లుగా దేవుడు ఉండాలని అనుకుంటున్నారు అంటే దేవునితో ఎటువంటి తీవ్రమైన సమస్యలు ఉండే అవకాశం లేదు అని ఊహించుకుంటున్నారు.
కానీ ఉనికిలో ఉన్న నిజమైన దేవుని విషయంలో, అనారోగ్యం మరియు విపత్తుతో సహా అన్నింటిపైన సార్వభౌమాధికారం కలిగిన దేవునితో, రక్షణ పొందిన మనం ఒకప్పుడు మనమందరం శత్రుత్వం కలిగి ఉన్నామని పౌలు చెప్తున్నాడు. హృదయ లోతుల్లో, మనం ఆయన సర్వాధిపత్యాన్ని, సర్వాధికారాన్ని అసహ్యించుకున్నాము.
మనము రక్షించబడ్డాము అంటే దేవుడు క్రీస్తు మరణం ద్వారా మన హృదయాలను జయించి, మనం ఒకప్పుడు అసహ్యించుకున్న వ్యక్తిని ప్రేమించేలా చేసిన దేవుని కృపే కారణం. ఈ అద్భుతమైన సత్యానికి మనం రుణపడి ఉన్నాము.
దేవునికి విరోధంగా ఉండకూడదని చాలామంది ఇప్పటికీ నేర్చుకుంటున్నారు. ఆయన అద్భుతమైన సహనం చాలా మంచి విషయం.