“మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను”. (2 కొరి౦థీ 7:4)
పౌలు గురించి ఒక అసాధారణమైన విషయం ఏంటంటే, పరిస్థితులన్నీ సానుకూలంగా లేనప్పుడు నమ్మశక్యం కానటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అతను కలిగియుండడమే.
ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
మొదటిగా, ఈ ఆనందం యేసు ద్వారా బోధించబడింది: “మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును” (లూకా 6:22-23). యేసు కోసం శ్రమలు పడడమనేది పరలోకం కోసం మీరు కలిగియున్న ఆసక్తిని మరింతగా పెంచుతాయి, అంటే ఈ ఆసక్తి భూమి మీదకంటే ఎక్కువ కాలం శాశ్వతంగా ఉండిపోతుంది.
రెండవదిగా, ఈ ఆనందం పరిశుద్ధాత్మ నుండి వస్తుంది గాని మన స్వంత వ్యయప్రయాసాల నుండి గాని, ఊహల్లోనుండి గాని, కుటుంబంనుండి గాని రాదు. “ఆత్మ ఫలమేమనగా, సంతోషము, …” (గలతీ 5:22). “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమునంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి” (1 థెస్స 1:6).
మూడవదిగా, ఈ ఆనందం దేవుని రాజ్యానికి సంబంధించినవాటి నుండి వస్తుంది. “దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైయున్నది” (రోమా 14:17).
నాల్గవదిగా, ఈ ఆనందం విశ్వాసం ద్వారా వస్తుంది, అంటే దేవుణ్ణి విశ్వసించడం ద్వారా వస్తుంది. “నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక” (రోమా 15:13). “మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును” (ఫిలిప్పీ 1:25).
ఐదవదిగా, ఈ ఆనందం యేసును ప్రభువుగా చూసి, ఆయనను ప్రభువుగా తెలుసుకోవడం ద్వారా వస్తుంది. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి” (ఫిలిప్పీ 4:4).
ఆరవదిగా, ఈ ఆనందం మోసపూరితమైన పరిస్థితుల మీద కాకుండా, ఆనందానికి మూలాలుగా ఉన్నటువంటి వాటిపైన దృష్టి పెట్టడానికి ఎక్కువగా కష్టపడే తోటి విశ్వాసుల నుండి వస్తుంది. “మీ ఆనందం విషయంలో మేము జతపనివారము …” (2 కొరింథీ 1:24).
ఏడవదిగా, ఈ ఆనందం శ్రమల ద్వారా మనల్ని పరిశుద్ధపరిచే విషయాల నుండి కలుగుతుంది. “అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము” (రోమా 5:3-4).
“మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను” అని పౌలు చెప్పినట్లుగా మనం ఉండకపోతే, ఆయనవలె ఉండాలని పౌలు మనకు పిలుపునిస్తున్నాడు. “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” (1 కొరింథీ 11:1). ఈ మాటలు మనలో చాలామందికి తీవ్రంగా ప్రార్దన చేయడానికి ఇవ్వబడిన పిలుపై ఉన్నది. ఎందుకంటే, పరిశుద్ధాత్మలో ఆనందకరమైన జీవితమనేది అసాధారణమైన జీవితం.