“అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను”. (రోమా 5:8)
ఈ వచనంలో “వెల్లడిపరచుచున్నాడు” అనే మాట వర్తమాన కాలానికి చెందినదని మరియు “చనిపోయెను” అనే మాట భూత కాలానికి చెందినదని గమనించగలరు. దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
వర్తమాన కాలాన్ని సూచిస్తున్న “వెల్లడిపరచుచున్నాడు” అనే ఈ మాట నేటికి జరుగుతూ ఉన్నటువంటి చర్య. ఇది రేపటి రోజున కూడా జరుగుతుంది.
భూత కాలానికి చెందిన “చనిపోయెను” అనే మాట క్రీస్తు మరణం ఒక్కమారే జరిగింది, ఇది ఇక ఎప్పటికీ పునరావృతం కాదని సూచిస్తోంది. “ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను” (1 పేతురు 3:18).
(“దేవుడు వెల్లడిపరచుచున్నాడు”) అనే ఈ వర్తమాన కాలానికి చెందిన ఈ మాటను పౌలు ఎందుకు ఉపయోగించాడు? “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరిచాడు (భూత కాలం); ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని పౌలు భూత కాలంలో చెప్తాడనుకున్నాను. క్రీస్తు మరణం, అంటే ఆయన మరణించినప్పుడు దేవుని ప్రేమ వెల్లడిపరచబడలేదా? దేవుని ప్రేమ గతంలో వ్యక్తం చేయబడలేదా?
దీనికి సంబంధించిన స్పష్టత ముందు చెప్పిన కొన్ని వచనాలలో ఇవ్వబడిందని నేననుకుంటున్నాను. “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు” (రోమా 5:3-5) అని పౌలు చెప్పాడు.
మరొక విధంగా చెప్పాలంటే, దేవుడు మనల్ని తీసుకు వెళ్ళే ప్రతిదాని యొక్క లక్ష్యం నిరీక్షణయైయున్నది. మనం శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు అచంచలమైన నిరీక్షణను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
అయితే మనం ఆ నిరీక్షణను ఎలా కలిగి ఉండగలం?
ఈ ప్రశ్నకు జవాబుగా పౌలు ఆ తరువాత వచ్చే వచనంలో చెప్తున్నాడు, “ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” (రోమా 5:5). దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడియున్నది. ఇక్కడ ఉపయోగించిన కుమ్మరింపబడియున్నది అనే క్రియకి అర్థం ఏంటంటే దేవుని ప్రేమ భూత కాలంలో (మనం మారుమనస్సు పొందినప్పుడు) మన హృదయాలలో కుమ్మరించబడియున్నది, అంటే కాకుండా అది ఇప్పటికీ పని చేస్తూ ఉంది, అంటే వర్తమాన కాలంలో కూడా ఉండి మనలో పనిచేస్తూ ఉంది.
మన పాపాల కోస౦ భూత కాలంలో ఒక్కసారే చనిపోవడానికి దేవుడు తన స్వంత కుమారుడిని ఇవ్వడ౦ ద్వారా మనపట్ల ఆయనకున్న ప్రేమను వెల్లడి చేశాడు (రోమా 5:8). అయితే మనకు ఓర్పు, మంచి నడత మరియు నిరీక్షణ అనేవి ఉన్నట్లయితే గతంలో చూపించబడిన ఈ ప్రేమను ప్రస్తుత వాస్తవికంగా అనుభవించాలని (అంటే, నేడు మరియు రేపటి కాలంలో జరిగే సంగతిగా) ఆయనకు తెలుసు.
అందుచేత, ఆయన కల్వరిలో మాత్రమే దానిని వెల్లడిపరచలేదు; మన హృదయాలలో ఉండే ఆత్మ ద్వారా ఇప్పటికీ ఆయన దానిని వెల్లడి చేస్తూనే ఉన్నాడు. సిలువ మహిమను రుచి చూడటానికి మరియు క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరుపరచలేదనే నిశ్చయతను చూడటానికి మన మనో నేత్రములను తెరచుట ద్వారా ఆయన ఈ కార్యమును జరిగిస్తాడు (రోమా 8:38-39).