జాన్ పైపర్ చేత అనుదిన ధ్యానాం
మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా (యోబు 6:26)
ప్రజలు దుఃఖం, బాధ, నిరాశలలో ఉన్నప్పుడు తరచుగా ఎప్పుడూ చెప్పని, మాట్లాడని విషయాలు చెబుతుంటారు. రేపటి రోజున సూర్యుడు ఉదయించినప్పుడు వారు రంగులద్దడంకంటే ముదురు రంగులతో వాస్తవికతకు రంగులద్దుతారు. వారు మైనర్ కీస్ లో (బాధతో కూడిన) పాటలు పాడతారు, అదే సంగీతమన్నట్లుగా మాట్లాడుతారు. వారు మేఘాలను మాత్రమే చూస్తారు గాని అక్కడ ఆకాశమే లేదన్నట్లుగా మాట్లాడుతారు.
“దేవుడు ఎక్కడున్నాడు?” లేక “వెళ్ళినా ప్రయోజనం లేదంటారు,” లేక “అర్థం పర్థం అంటూ ఏమీ లేదు,” “నాకు ఎటువంటి నిరీక్షణ లేదు,” “దేవుడు మంచివాడైతే, ఇలా జరిగుండేది కాదు” అని వారు అంటూ ఉంటారు.
ఇటువంటి మాటలతో మనమేమి చేయాలి?
అటువంటి మాటలను మనం గద్దించనవసరం లేదని యోబు భక్తుడు చెబుతున్నాడు. ఆ మాటలు గాలివంటివేనని, లేక అక్షరార్థంగా చెప్పాలంటే “ఆ మాటలు గాలే గాని మరేది కాదు.” అవి త్వరగా బయటకు ఊదబడతాయి. పరిస్థితుల మధ్యన ఒక మలుపు వస్తుంది మరియు నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి చీకటి రాత్రి నుండి మేల్కొలపబడతాడు మరియు తొందరపాటులో చెప్పిన మాటలకు చింతిస్తాడు.
అందుచేత, ఇక్కడ విషయం ఏంటంటే అటువంటి గాలి మాటలను గద్దించడానికి మన సమయాన్ని, మనకివ్వబడిన శక్తిని వినియోగించకూడదు. అవి వాటంతటికవే గాలిలో ఎగిరిపోతూ ఉంటాయి. ఆకులు రాలే కాలంలో ఆకుల్ని కత్తిరించనక్కరలేదు. ఒకవేళ అలా కత్తిరిస్తే, అది కేవలం వృధా ప్రయాసే. ఎందుకంటే, కొంత సమయం తర్వాత, అవంతటికవే రాలి గాలిలో ఎగిరిపోతాయి.
కొన్నిసార్లు దేవుణ్ణి, సత్యాన్ని సమర్థించడానికి మనమెంత త్వరగా గాలిలో ఎగిరిపోయే మాటల్ని ఉపయోగిస్తుంటామో కదూ! మనకు వివేచన ఉన్నట్లయితే, మూలాలు ఉన్నటువంటి మాటలకు మరియు గాలిలో ఎగిరిపోయే మాటలకు మధ్యన ఉండేటువంటి వ్యత్యాసాన్ని చెప్పగలుగుతాం.
లోతైన తప్పులోను, లోతైన చెడులోను మూలాలు ఉన్నటువంటి మాటలు ఉన్నాయి. అయితే, బాధాకరమైన మాటలన్నీ చెడు హృదయము నుండి వచ్చినవి కావు. వాటిలో కొన్ని బాధ, నిరాశ నిస్పృహలనుండి వచ్చినవే. మీరు వినేవన్నీ హృదయ లోతుల్లో నాటుకుపోయిన మాటలు కాదు. అవి పుట్టుకొచ్చే చోట కొంత నిజముంది, మరికొంత చీకటి కూడా ఉంది. అయితే అది తాత్కాలికమే, అంటే వచ్చి వెళ్లిపోయే అంటు రోగములాంటిది, అంటే అది నిజమైన బాధను కలిగిస్తుంది గాని నిజమైన వ్యక్తి కాదన్నమాట.
అందుచేత, సత్యానికి, దేవునికి, మనకు విరుద్ధంగా పలికిన ప్రతి మాట గాలివంటి మాటనా, లేక అంతరంగంలో నుండి పలికిన మాటనా, గాయపడిన హృదయం నుండి పలికిన మాటనా అని మనం వివేచించడం నేర్చుకోవాలి. అవి గాలివంటి మాటలైతే, వాటిని గద్దించకుండా మౌనంగా ఉండి, వేచి చూద్దాం. మన ప్రేమకు ఉన్నటువంటి గురి ఏంటంటే అంతరంగాన్ని పునరుద్ధరించుకోవడమే గాని గాయాన్ని గద్దించడం కాదు.